సోమవారం, డిసెంబర్ 14, 2015

ఆకాశమంతా నిర్మానుష్యంగా ఉంది. నల్లని త్రాచులాంటి తార్రోడుపై  నా కారు పరుగెడుతుంది. నేను ఇండియా వచ్చి రెండురోజులయ్యింది. ఆరెండు రోజులూ కాకినాడలోనే ఉండిపోయాను. ఈరోజు ఎలాగైనా నేను పుట్టిన పల్లెటూరు చూసి రావాలనిపించి బయలుదేరాను. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. అప్పటికే చిరుజల్లులు ప్రారంభమయ్యి చలి పుడుతూంది.
   "అమెరికా నుండి వచ్చి కాకినాడలోనే ఉండిపోతావా? నన్ను చూడాలని అనిపించడం లేదా? " నేను ఇండియా వచ్చిన దగ్గరనుండి మా బామ్మ నన్ను తిడుతూనే ఉంది. నాకు మా బామ్మ కంటే ఎవరున్నారు? ఆమెను చూడకుండా ఉండగలనా? నేను వచ్చిన రోజే కాకినాడ వచ్చేయమన్నాను..నేను అంతదూరం రాలేను. నీవు ఇక్కడికి రా? అంది.
   నేను వూరు వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంది. కారణం పేరే సబీరా!
   మా పల్లెలో మాఇంటి ఎదురుగానే వాళ్లిల్లు ఉంది. తనను నేను మొదటిసారి చూసినప్పుడే నేను తను లేకపోతే బ్రతకలేను అనిపించింది. నయాగరా జలపాతంలాంటి నడుముతో, చంద్రబింబంలాంటి కళ్ళతో తెల్లని పాల నూరుగులా ఉండేది. ఆమెను ఎంత చూసినా చూస్తూనే ఉండిపోవాలనిపించేది.
   నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మా ఎదురింటి ఇల్లు కొనుకుని నివాసం వచ్చేశారు. నిజానికి వాళ్ళ అసలు వూరు ఎక్కడో కూడా నాకు తెలియదు. వచ్చిన కొన్ని రోజులకే మా ఫ్యామిలీ సభ్యులతో బాగా కల్సిపోయింది. నెలరోజులకు నాతో మమేకమైపోయింది. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా కబుర్లు చెప్పుకున్నాం. పల్లె అందాలన్నీ ఆమెకు చూపించే వాడిని. వూళ్ళో వాళ్ళందరూ మమ్మల్ని చూసి చాలా ముచ్చట పడేవారు.నా స్నేహితులు మా ఇళ్ల దగ్గర మా గురించి తెలియనీయకుండా ఎంతో శ్రమ పాడేవారు. మా పెద్దమ్మ కూతురు పూజిత సహకారం ఎంతో ఉండేది. నాకు ఆమెను తప్ప మరొకరిని పెళ్లి చేసుకుని నేను బ్రతకలేననిపించేది. విషయాన్నే మా వాళ్ళకు చెప్పాను. మా నాన్న గారు ససేమిరా అన్నారు. వాళ్ళ కులం, మనకులం ఒక్కటి కాదని పెళ్లి జరిగితే నేను తలెత్తుకుని వూళ్ళో తిరగలేనని ఖరాఖండిగా చెప్పేశారు. మా అమ్మ ఏమి మాట్లాడకపోయినా మా బామ్మ మాత్రం నన్ను వెనకేసుకునే వచ్చింది.
    సబీరా ఇంటిలో వాళ్ళు కూడా మా పెళ్ళికి ఒప్పుకోలేదు.  వాళ్ళ ఫ్యామిలీకి కులం కంటే మతం అడ్డొచ్చింది.
    మా ప్రత్నాలెవీ ఫలించలేదు. దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే ధైర్యం అమ్మాయి చెయ్యలేకపోయింది. చూస్తుండగానే కాలం పరుగులు తీసింది. నాకు డిగ్రీ పూర్తయ్యేటప్పటికి ... అమ్మా,నా..న్న కారు యాక్సిడెంట్లో నన్ను దూరంగా విడిచి వెళ్లిపోవడం, సబీరాకు వాళ్ళ బావతో పెళ్లైపోవడం ఒకసారే జరిగిపోయాయి. నాకు ఏడ్వడానికి కన్నీళ్లు కూడా రాలేదు. నా హృదయంలోని బాధ తాలూకూ వేడికి కన్నీళ్ళన్నీ ఎప్పుడో ఇంకిపోయాయి. స్తబ్ధుగా మారిపోయాను. పరిసరాలు గుర్తించలేకపోయేవాడిని.
    నన్ను చూసి మా అక్క,బావలు తట్టుకోలేకపోయారు. నన్ను బలవంతంగా అమెరికా తీసుకుపోయారు. నేను వెళ్లిపోయే రోజు సబీరా కనిపిస్తుందేమోనని చూశాను. ఆమె నాకు కనిపించలేదు.
    కొన్నాళ్ళకు నేను తేరుకున్న తరువాత అమెరికా నుండి బామ్మకు ఫోన్ చేసి సబీరా ఎలా ఉందని అడిగే వాడిని. తన గురించి బామ్మ అన్నీ విషయాలు చెప్పేది. సబీరా నన్ను కల్సినప్పుడు ఎలా ఉన్నాడని, ఒకసారైనా చూస్తానా అని ఏడిచేదని కూడా చెప్పేది. ఒకసారి మాట్లాడించు అంటే తను మాట్లాడనని చెప్తుందని చెప్పేది. ఇలా ఒక నెలరోజుల తరువాత సబీరా వాళ్ళ అత్తవారింటికి వెళ్లిపోయిందని, ఇక రావడం లేదని చెప్పేది.
    "తనకు పెళ్లి అయ్యిపోయింది కదా నాయనా? ఇక మర్చిపో!.. తను ఎప్పుడూ నీకు బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటానని చెప్పేది తెలుసా?" మా బామ్మ నన్ను జ్ఞాపకాల నుండి మరలించడం కోసం, మామూలు మనిషిని చేయడం కోసం ప్రయత్నించేది.
    నేను ప్రతిరోజూ ఫోన్ చెయ్యడం మానలేదు. మా బామ్మది ఒకటే సమాధానం సబీరా ఇక రావడం లేదని. మనస్సంతా బరువుతో నిండిపోయేది. ఇలా రోజులు నడుస్తున్న సమయంలో ఒకసారి బామ్మ ఫోన్ చేసి " సబీరా చచ్చిపోయిందని" చెప్పింది.
***
చల్లని గాలి తిమ్మెర ఒకటి ఒకసారిగా ముఖం తాకేటప్పటికి జ్ఞాపకాల్లోంచి బయటికొచ్చాను. వర్షం బాగా పెరిగిపోయింది. వాహనాలు మసక,మసగ్గా కనిపిస్తున్నాయి. గు౦డెలనిండా  ఒక్కసారి ఊపిరి పీల్చుకుని కారు ముందుకు పోనిస్తూ ఒక్కసారే సడన్ బ్రేక్ తో కారు ఆపాను. గుండె ఆగినంత పనయ్యింది.
 లిఫ్ట్ అడుగుతూ సబీరా ఎదురుగా నిలబడివుంది...
( అసలు భాగం రేపుంది )

4 కామెంట్‌లు:

 1. అబ్బో కథ సూపరుంది. టెన్షన్ లో పెట్టి వదిలేశారు.ఇంతకీ సబీరా..బ్రతికే వుందా?

  రిప్లయితొలగించు
 2. >>> నయాగరా జలపాతంలాంటి నడుముతో :)

  ఇంత వైడ్ ఆంగిల్ నడుమా ! వామ్మో ! వామ్మో :)

  జేకే!

  జిలేబి

  రిప్లయితొలగించు
 3. aravind గారికి,Zilebi గారికి కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించు
 4. కథ, కథనం రెండూ బావున్నాయి.
  ఈ సస్పెన్సే, మరీ అన్యాయం. ��

  రిప్లయితొలగించు

Popular Posts

Recent Posts