సోమవారం, జులై 01, 2019

mother-and-sons
సుమారు పాతికేళ్ల క్రితం...మా ఇంటికి సమీపంలో ఒక కుటుంబం ఉండేది.  తల్లి, కుమారుడు, కోడలు.  ఆమె భర్త చనిపోయాక అతని పెన్షన్ ఆమెకు వస్తుండేది..చాలా స్వల్పమొత్తం.  రెండు వేలో, మూడు వేలో ఉండేది.  ఆమెకు ఆరుగురు కొడుకులు.  అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు.  అందరికీ వివాహాలు అయ్యాయి..ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు పిల్లలు కూడా.  కొందరు అమెరికాలో స్థిరపడ్డారు.  నగరంలోనే అందరికి సొంత ఇల్లు, కార్లు ఉన్నాయి.   జీతాలు, పై సంపాదనలు ఎక్కువే.  తండ్రి చనిపోయాక తల్లిని ఎవరు చూడాలి? అని కోడళ్ళు ప్రశ్నించగా కొడుకుల మధ్య చిచ్చు రేగింది.  నీకు ఎక్కువ సంపాదన కాబట్టి నువ్వే చూడాలి అని ఒకరు, నేను ఒక్కడినే ఎందుకు చూడాలి అని మరొకరు..ఈ విధంగా కొట్టుకున్నారు.  ఆ తరువాత ఒక శ్రేయోభిలాషి వారి మధ్యన రాజీ కుదిర్చాడు.  ఒక్కొక్క కొడుకు రెండు నెలల పాటు తల్లిని చూసుకోవాలి అని సూచించాడు.  ఆమె ఉండే ఆ రెండు నెలలకు వచ్చే పెన్షన్ ను ఆ కొడుక్కు ఇవ్వాలి!ఆ రకంగా ప్రతి రెండు మాసాలకు ఒకసారి ఆ తల్లిని పిల్లి తన పిల్లలను తిప్పినట్లు తిప్పుతుండేవారు.  ఒక కొడుకు దగ్గర ఉన్నప్పుడు ఏదో అనారోగ్యం సంభవించి ఆసుపత్రి పాలైతే పదివేలు ఖర్చు అయింది.  ఆ పదివేలు అందరూ సమానంగా భరించాలని సదరు కొడుకు పేచీ పెట్టాడు.  నీదగ్గర ఉన్నప్పుడు ఖర్చు అయితే మాకేమిటి సంబంధం? అని మిగిలిన కొడుకులు లా పాయింట్ లేవదీశారు.  మళ్ళీ పంచాయితీ...పెద్దమనుషుల ఒప్పందాలు!

భగవంతుడి లీల ఏమిటంటే...అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ, అనుభవించే యోగ్యత లేకుండా కొందరిని యాభై ఏళ్ళు కూడా బతకనివ్వడు..పరమ దరిద్రముతో, అందరిచేతా ఛీ అనిపించుకుంటూ హీనంగా బతికేవారిని తొంభై ఏళ్లయినా తీసుకుపోడు.  ఆమెకు ఎనభై ఐదు ఏళ్ళు వచ్చినా, మంచం మీద పడినా, ప్రాణం మాత్రం పోదు.  ఆ పరిస్థితుల్లో ఆమె ఉంటున్న కొడుకు వంతు అయిపొయింది.  మరో కొడుకు వచ్చాడు తీసుకెళ్లడానికి.  ఆమె ఉండే గడువు రెండు రోజుల్లో అయిపోతుందనగా కోడళ్ళు ఫోన్లు చేసుకుని మీ వంతు వచ్చింది అని గుర్తు చేసుకునేవారు.

ఆమెను పలకరిద్దామని వెళ్ళాము.  కాసేపు మాట్లాడిన తరువాత ..."భగవంతుడికి నామీద ఎందుకు దయ కలగడంలేదు అర్ధం కావడం లేదు.  ఆరుగురు కొడుకులను కన్నాను కానీ, అన్నం పెట్టేవాడిని కనలేకపోయాను"  అన్నది కన్నీరు విడుస్తూ.   హృదయం బద్దలయింది నాకు.  ఎవరో నా గుండెను గుప్పెట్లో పెట్టుకుని మెలిబెట్టినట్లు అనిపించింది.

1 కామెంట్‌:

 


Popular Posts

Recent Posts