బుధవారం, సెప్టెంబర్ 21, 2016

మన దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది, ఆర్ధిక వ్యవస్థ బలపడుతోంది, ఇండియా పూర్తిగా వెలిగిపోతోందంటూ మన పాలకులు చేసే ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరు మారుమ్రోగుతోంది. అంతర్జాతీయ క్రీడలు సైతం భారతదేశంలో నిర్వహిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇండియా పోటీపడుతోంది. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే, ఇక నాణానికి మరోవైపు గమనిస్తే సగటు మనిషి జీవనం దుర్భరంగా మారింది. పేదలకు కూడు, గూడు, గుడ్డ కరువయ్యాయి. ప్రజల కష్టాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. రైతుల సమస్యలు తగ్గడానికి బదులు నానాటికీ పెరిగిపోతున్నాయి.
మరోవైపు సామాజిక రగ్మతలు పట్టిపీడిస్తున్నాయి. ఆర్ధిక సమస్యలు మనిషిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. రాజకీయ వ్యవస్థ రోజురోజుకూ భ్రష్టుపట్టిపోతుంది. మైనారిటీ పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వారిలో మార్పు కనబడటం లేదు. సామాజికంగా మైనారిటీ ల హోదాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కేవలం రిజర్వేషన్ల సౌకర్యం తప్ప మిగతా ప్రభుత్వ సౌకర్యాలు ఏవి వారికి అందడం లేదు.
ఇక ఆర్ధిక సమస్యల విషయానికి వస్తే, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా  పెరిగిపోయాయి. సగటు మనిషి బ్రతకడానికి పోరాడుతున్నాడు. ఒకవైపు ప్రభుత్వం స్వయం సమృద్ధి గురించి బీరాలుపలుకుతోంది. కానీ మరోవైపు వ్యవసాయ దేశoగా పేరున్న మన దేశంలో ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల విచిత్రంగా మారింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలైంది. దైవానుగ్రహం వల్ల వర్షాలు కూడా సకాలంలో కురుస్తున్నాయి. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది మన రైతన్న పరిస్థితి.
సగటు ప్రజలకు వైద్యసదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెలగడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రాష్ర్టంలోని పలుపట్టణాల్లో మురికినీటి సమస్యల వల్ల ప్రజల తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఇంతజరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టడంలేదు. ఇక గ్రామాల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు. పరిస్థితి ఇంతదయనీయంగా మారినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రభుత్వ ఖజానాను పెంచుకునే మత్తులో ఉంది ప్రభుత్వం. దానికోసం ప్రజల ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతోంది. అన్ని చెడులకు మూలమైన మద్యం ద్వారా ఖజానా నింపుకోవాలని చూస్తోంది. ఈ మద్యం మహమ్మారి ఏదో ఒక రూపేణ ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నా సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది. 
మధ్య తరగతి, పేదల కష్టాలను తీర్చలేని అభివృద్ధి నిజమైన అబివృద్ధి కాలగదా... ఓట్లు వేసే ప్రజల ఆ ఓట్లతో అందలమెక్కే సిగ్గు లేని నేతలు ఈ విషయమై ఆలోచించాలి. పదే,పదే అదే నాయకులకు ఓట్లు వేసే సిగ్గు లేని ఓటర్లు కూడా దీని గురించి ఆలోచించుకోవాలి. 

0 Comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Follow by Email

Popular Posts

Recent Posts